Naaku Thochina Maata    Chapters   

శ్రీ శివాయ గురవే నమః

పితా పుత్ర కవి చరిత్రము

సీ|| తనుc బరీక్షింపc బూనిన త్రిమూర్తుల నర్భ

కులc జేసె నెవ్వాని కులపురంధ్రి

శాపోక్తి శతఖైశ్వర్య గర్వస్ఫూర్తి

వనరాశిc గలిసె నెవ్వాని సుతుcడు

నిఖిలజగత్ప్రీతి నెఱవు వెన్నెలఱని

గనియె నెవ్వాని దృక్కంజ లక్ష్మి

స్వతపః ప్రభావ మోహితముక్తి కుచతటా

వరణో త్తరీయ మెవ్వాని సుయశ

గీ|| మా సుగుణ రాజధాని మహావధాని

వేదవేద్యైక సన్మాని వినతమాని

హర్షవేణీ స్నపితమౌని యత్రిమౌని

పొసcగు కారుణ్యము మమ్ముc బ్రోచు నెపుడు.

అ|| ఆ త్రిమూర్తి కీర్తు లడియాలములుగc

ద్దత్తమూర్తి యగుచు తాన తోచె

నత్రిమౌని కనఘ కనసూయ కమ్మహా

త్రేయ యోగివరు స్మరింతు నెపుడు.

అ|| అమ్మునీంద్ర గోత్రమందు జన్మించి బ్ర

హ్మాత్మ కేవలత్వ మవధరించి

ప్రధితిc గన్న రామభట్టారకు మదన్వ

యప్రధాన పురుషు నభినుతింతు.

సీ|| అఖిల వేదాంగ విద్యావదాన్యుడు సింగ

ధన్యుc డేకృతి ప్రపితామహుండు

శ్రుతి చయోచ్చారణారూఢతా బ్రహ్మ సు

బ్రహ్మణ్యుcడే భవ్యభావు తాత

యాగమరత్న రత్నాకరుండల బుచ్చ

యార్యుcడే సత్కలాధుర్యు తండ్రి

లలితలక్షణ యక్కలక్ష్మాంబ తులితాంబ

కడుపారనేయన్నc గన్నతల్లి

అ|| శ్రీ పదాంతరోప జీవితా నారాయ

ణాహ్వుcడేయుదారు నన్నగారు

హర్షమూర్తి నమ్మహామహు మాతండ్రి

హనుమదాఖ్యు సంస్తవన మొనర్తు!

అ|| కన్నతండ్రియయ్యెc గరుణాబ్థి నామన్చెc

గలలc బెన్చె బోధ ఘటనc దేర్చె

నట్టి ప్రవరు లక్ష్మమాంబికేశ్వరు గురు

నలవి యగునె వొగడ హనుమదార్యు.

కం|| తులనా విరహితు విద్యా

నిలయుం గారుణ్యమూర్తి నిర్మలు మన్మా

తులునిం బ్రధమాచార్యునిc

దలతున్‌ లక్ష్మీనృసింహుc దనరు ప్రవర్తిన్‌

- శ్రీరామకథా మృతము.



ఈ మహాకవి యాత్రేయస గోత్రుcడు. దత్తదేవుడు స్వీయుcడు. ఆ వంశమున రామభట్టారకుడని చతుర్దశవిద్యా ప్రవీణుcడు గోదావరితీరము నుండి కృష్టాతీరమందలి మునిపల్లె యను గ్రామమునకు వచ్చెనని వాడుక కలదు. తరువాత సింగభట్టను మహితుడు ఆరుశాస్త్రములు, మూడు వేదములు చదివి, చదివించి కీర్తినొందెను. వారికి సుబ్రహ్మణ్యావధాని యనజనించెను. ఆయన కుమారుcడు బుచ్చయార్యుండన శాస్త్రజ్ఞుడు. వాని భార్య యక్కలక్ష్యాంబ. ఆ దంపతులకు హనుమచార్యుcడన జనించెను. వాని యన్న లక్ష్మీనారాయణుcడు. ఆ హనుమదార్యుని భార్య లక్ష్మాంబ. వారి కుమారు లిరువురు శ్రీ వేంకటప్పయ్యశాస్త్రి, శ్రీ సీతారామావధాని యనువారు. బాలా త్రిపురసుందరి యను నొక పుత్రికయుc గలదు. ఈ సీతారామావధానిని పెదతండ్రి యవు లక్ష్మీనారాయణుడు పెంచుకొనెను. ఆయన కుc బుత్ర పుత్రికా సంతానము కలదు. అందు ప్రసిద్ధుడవు సాంబమూర్తి శాస్త్రి మహాపండితుడు, మహాకవి యని ప్రథితి నొంది ముందుగానే కీర్తిశేషుcడయ్యెను. cc బ్రస్తుతుcడవు వేంకటప్పయ్యశాస్త్రికిc బత్నియవు హనుమాంబ యందు మువ్వురు పుత్రులు, పుత్రిక లైదుగురు వొడమిరి. 1. రాఘవనారాయణశాస్త్రి. ఈయన పత్ని శ్రీదేవి, పార్వతి యని తలిదండ్రులు బెట్టిన పేరు. వీరి పుత్రుడు లక్ష్మీనారాయణశాస్త్రి. పది పదారేండ్లలో విజ్ఞు డనిపించుకొని కీర్తి నిలుపుకొని చనియెను. కూతురు శ్రీ లక్ష్మి యన చెరువు శేషయ్యశాస్త్రి పత్నియై సత్యనారాయణశాస్త్రి యను కొడుకునుగని గౌరియయ్యెను. వానిభార్య లక్ష్మి. వారు పుత్రవంతులు.

ఇక రెండవవారు హనుమచ్ఛాస్త్రి, ఈయన చదువుసంధ్యలలో నారితేరి 20 సంవత్సరములకే స్వర్గతుడయ్యెను.

మూడవవారు బాలకోటీశ్వరశాస్త్రి ఈయనకు ముగ్గురు కొడుకులు నల్వురు కూతుండ్రు కలరు. 1. లక్ష్మీధరశాస్త్రి, పత్ని రుక్మిణి, పుత్రవంతులు. 2. హరదత్తశాస్త్రి, పత్ని ఆదిలక్ష్మి కామేశ్వరి. 3. గురుదత్తశాస్త్రి పత్ని శారద. cక కూతులు. 1. సుశీల, పతి జానకిరామశర్మ 2. లలిత, పతి ధూళిపాళ రామారాయ. 3. అనసూయ, పతి మేళ్ళచెరువు సుబ్రహ్మణ్యశాస్త్రి. 4. ప్రియంవద, పతి దెందుకూరి చినహనుమద్ఘనాపాఠి.

ఇది ¸°న వంశము. cక విద్యావంశము. ఈ వేంకటప్పయ్యశాస్త్రిగారు చిన్నతనమున నుపనీతుcడై వ్రాయ చదువ నేర్చి యూరక తిరుగుచుండ నప్పటికాలమున చందోలులో పోష్టుమాస్టరుగా నున్న కొలచిన యజ్ఞనారాయణశాస్త్రిగారు దీక్షాపరులు; కల్యాణానంద నాథులని వారి దీక్షానామము. ఈమహాసిద్ధ పురుషుcడు వీరితండ్రితో చెప్పి, తనవద్దకు రప్పించుకొని, ఒకనాడు శివపూజకుc దుమ్మిపూలు తెచ్చిపెట్టుమని చిన్న పూలపాత్రము నిచ్చి, ఒక్కొక్కపూవున కొక్కొక్కపరి ఓంనమశ్శివాయ యని యుచ్ఛరించుచు పూలు కోయుమని పంపిరి. అంతలో నాటలుమాని ప్రతిదినము పూలుదెచ్చి యిచ్చుటయేగాక ఆ మహాత్ముని వీడలేక వెంటనంటియుండ నా మహాత్ముడు తన మంత్రగ్రంథములు శిథిలమైనవని, వీరిచేత తాను చెప్పుచు వ్రాయించుచు, ఒక్కొక్క మంత్రము, మహిమము చెప్పుచు, కాలామృతాది గ్రంథములచెప్పుచు, నింతలో వారు చందోలునుండి బందరు పోవుచు వెంటపంపవచ్చిన శిష్యునిcగని, ఒకసారి బందరు రమ్ము, నీకు దీక్ష నిచ్చెదనని చెప్పి, యంతలో తమకు స్ఫురించిన భావిగతిc ద ంచి బిడ్డా! నేను నీకు దీక్ష నీనక్కఱలేదు. పరాశక్తి నిన్ను స్వయముగా ననుగ్రహించెద ననుచున్నది. నీవు కృతార్థుcడవు. నన్ను మరువకుమని దీవించి పోయిరి.

అప్పుడు చదువుకొనవలెనని వీరికి బుద్ధిపుట్టినది. దూరదేశ మేగుటకు తలిదండ్రు లొప్పలేదు. వివాహమయినది. గృహిణి కాపురమునకు వచ్చు దినములు ఈ పరిస్థితులలో చందవోలునకు పరిసరమందు నున్న పొన్నూరు గ్రామము నందున్న పాతూరి కోటయ్యశాస్త్రిగారి వద్దకుపోయి పరిస్థితులు చెప్పగా నిప్పుడింక నీకేమి చదువు వచ్చును అని వీరి తీవ్రతగుర్తించి, రఘవంశము చతుర్థసర్గము ప్రారంభించి చెప్పుచుండ నొకనాడు గురువుగారు బజారులో చెప్పవలసిన సంస్కృత కాశీఖండము పురాణము వారికి నాశౌచము వచ్చినదని చాలింపనెంచిన శ్రోతల నిర్భంధము ననుసరించి గురువుగారి సెలవు తీసికొని ఈ శిష్యుcడు చెప్పెను శ్రోతలట్లుండ శ్రీగురువే వారి మెచ్చుకొని వెంటనే కుమారసంభవము పంచమసర్గము నారంభించిరి. అది పూర్తికాకముందే సంస్కృతమున కవిత్వము ప్రారంభించి గురుస్తుతి శతశ్లోకి వ్రాసిరి. గురుని సంతస మింతింత యనరాని దయ్యెను. అప్పుడా గురువు శిష్యునకు వైయాకరణ సిద్ధాంత కౌముది నుపదేశించి నేను ప్రస్తుతము కాశీకి పోవుచున్నాము. నీ వెక్కడనైన చదివిన సరే, అట్టి సందర్భము కుదురకున్నను వ్యాకరణశాస్త్రమున నీకన్ని గ్రంథములు సమన్వయించు నన్ను తలcచుకొని చదువుకొనుమని దీవించి పోయిరి. ఆ శాస్త్రమాయాచార్య నాశీశ్శుతోనే స్వాధీనమైనది.

తరువాత కృష్ణాతీరమున కళ్ళేపల్లి యను గ్రామమున నున్న అద్దేపల్లి సోమనాధశాస్త్రిగారికి తర్కము చదువుకొన మీవద్దకు వచ్చెదనని వీరు గీర్వాణభాషలో వ్రాసినలేఖ వారి శిష్యుల కర్థము కాకపోయిన, వారు పర్యాలోచించి చెప్పవలసి వచ్చినది. తరువాత దర్శనము చేసికొనిన యీ శిష్యుని మెచ్చుకొని 45 రోజులు మాత్రమే వారు తర్కము పాఠము చెప్పి, భాష నీస్వాధీనములో నున్నది నీవు తీవ్రప్రజ్ఞుcడవు. ఈశాస్త్రము నీకన్వయించును చూచుకొనుమని చెప్పిపుచ్చిరి. ఆ శాస్త్ర మా విధమున కైవసమైనది.

పిదప శ్రీ కోట నరసింహశాస్త్రిగారు అను నాచార్యునివద్ద శాంకర శారీరక మీమాంసాభాష్యము శాంతిచేయుచుండ నా మహాత్ముడు నాకన్న నీయందే శంకరానుగ్రహము కలదు. నేను దేశించితినను గౌరవముంచి, సంప్రదాయవిశేషములున్న నేను చెప్పెదను, నీవే భాష్యము ననువదింపుమని సెలవిచ్చిరి. ఇట్లు వారి విద్యాభ్యాసకాలము 11 మాసములు మాత్రమే యని వాడుక. కొలcది దినములు తురగా వెంకంరాజుగారు అని అప్పటి కాలములో ప్రసిద్ధుcడగు కవివరునితో గలసి సంచారము చేసిరి. వారితో కలియుటవలన కవితాధార పరిశుద్ధమైనది కాన, యాయన కూడ నొక గురువే యని తమ పొత్తముల యందు వర్ణించుచుందురు.

ఉభయశాస్త్రంబులని కాక యుపరిశాస్త్ర మింకొకcడు గూడ నుపదేశమాత్రముననే గ్రహించు తెలివి గలిగియు, గురువుల ననాదరింపమని చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగా రడుగ-నాకు ఓనమాలు చెప్పిన దండయ్య పంతులు వద్దనుంచి ఈనాటివరకు నొకయక్షరము చెప్పిన గురువైన వీడక కొలుచుచు వారికెల్ల నిత్యము తర్పణము చేయుచుందును. నాగురుభక్తియే నాకు సర్వము కరతలామలకము చేయగలదు, అని వాక్రుచ్చిరి.

ఇక వీరి జన్మపత్రిక

స్వస్తిశ్రీ విభవనామ సంవత్సర ఆశ్వయుజ శు 2 లు చిత్తానక్షత్రయుక్త మకర లగ్నమున జననము, జననకాల కుజమహాదశ.

భావనామసం|| ఆశ్వయుజబ||3 లు కైలాసము నలంకరించిరి.

మీరు వ్రాసిన గ్రంథములు

సంస్కృతము: శ్రీశైల తీర్థసారము 2. హరిశ్చంద్ర సుకృతకావ్యము. 3. గురుస్తుతి 4. అంబాసహస్రము.

తెనుcగు: 1. శ్రీరామకథామృతము 24 వేలు పద్దెములు. వాల్మీక కధావృత్తము అధ్యాత్మతత్త్వము విడువక వ్రాయబడెను.

2. శ్రీకృష్ణ విలానము 3. శ్రీ కాకాని మల్లీశ్వర మాహాత్మ్యము 4. భద్రాయురుపాఖ్యానము (నాటకము) 5. త్రిశంకుస్వర్గము (నాటకము) 6. శ్రీ శంకరవిజయ కథాసార సంగ్రహస్తోత్రము 7. చలపాదులత 8. మండగ్రహ నిగ్రహము 9. ప్రహ్లాదసుహ్లాదము 10. సీమంతినీ చరిత్రము 11. తుకారామ్‌ ప్రవృత్తి 12. సావిత్రీ చరిత్రము 13. పుష్పమంజరి 14. వాస్తుసర్వస్వము 15. స్మృతి సమాహృతి* 16. ప్రాస్తావిక పద్య గద్యాణములు, ఇంతవరకు నా యెరిcగినవి. 17. బాలకోటీశ్వర శతకము 18. హోమ దుర్గాంబశతకము 19. శ్రీ వేంకటేశ్వర త్రిశతి 20. కావ్యకన్యాతారావళి.

_______________________________________________

* ఇవి రెండును కనుపించుటలేదు. 13, 14, 15, 16 ఇవి హరికథలు గేయములు.

వీరు నలుబది సంవత్సరములు సంస్కృతపాఠశాల సాగించిరి. పదిపదియేగురు విద్యార్థులకు నిత్యము తమ యింటిలో భోజనము పెట్టి చదువులు చెప్పుచు తమ జీవితమెల్ల సార్ధకమొనరించుకొని, షుమారు 400 లకు తక్కువ లేకుండ వారివలనc గవితయందును, శాస్త్రముల యందును, పురాణ దోరణుల యందును, పం తులైన విద్యార్థులే సచేతన ధ్వజములై వారి కీర్తి స్ఫూర్తికి నిమిత్తమైరి. వీరికిc బూర్వప్రారబ్ధమునc గడుపులో శూలనొప్పి కలదు. దానికి నోర్చుకొనుచు నొకచేతితోc గడుపుపట్టుకొని రేయుcబవళులు విద్యార్థులకు విసువులేకుండ విద్యాదానము చేయుచుండెడివారు. మొదట శివాలయమున బాలురకు పాఠములు చెప్పుచుండెడివారు. తరువాత నిడుబ్రోలు వాస్తవ్యులు పాములపాటి సుబ్భారాయుడు చౌదరిగారి ప్రేరణతో నొక పాఠశాల కట్టించి యందు శంకర విద్యాశాల అనుపేరుతో కొంతకాలము ప్రచారము చేసిరి. దానితో గొన్ని అప్పులయి ఆస్తియంతయు బోయినను వారి యుద్యమము చాలింపక చుట్టుప్రక్కల రైతుల సహాయముతో వారి జీవితాంతము నా సంస్థ నెరవేర్చుచుండిరి. సర్కారువల్ల గ్రాంటు ఇప్పించెదమని యా దినములలో శ్రీ చావలి సూర్యప్రకాశరాయాదు లుద్యోగులు వారి వెంట తిరిగెడువారు. రికార్డు చంకన పెట్టుకొని మీ యందఱ చుట్టు త్రిప్పవలెననియా మీకోరిక. నాకట్టి ధనములు, హోదాలు అక్కర లేదనెడువారు ఒక పర్యాయము త్రోవన పోవుచు పెదపమిడి జమిందారు వారి పాఠము చెప్పు పద్ధతికి నావర్జితుcడై ఒకనాడు పవలు రాత్రియు వారింట భోజనముచేసి, మరునాడు ప్రయాణమై పోవుచు వారితో - అయ్యా! నేను పెదపమిడి జమిందారును, 60 ఊళ్ళు నాక్రింద కలవు. నేను బందుగులc జూడc బోవుచు మీ పాఠకశక్తి నన్నాకర్షింప నిచ్చట నిన్న నుంటిని నాకు చాల సంతసముగా నున్నది. మీ రొకసారి మాసంస్థానమునకు వచ్చిన, మీ పాఠశాలకు కొంత సాయము చేసెదనని నవినయముగc జెప్పెను. దానికి వారు కినిసి ఈ దొంగధర్మము నిన్నెవరు చేయమనిరి? అట్టి ధనము మాకక్కరలేదనిరి. జమీందారుగారు అయ్యా! నాది యెట్లు దొంగధర్మమో నాకు తెలియుటలేదు. మీరు చెప్పిన తెలిసికొని మార్చుకొందు ననిరి. అది విని శాస్త్రిగారు - నీవు 60 ఊళ్ళు ఏలువాడవు. నీగ్రామములో నాలుగుచోట్ల నాలుగు పాఠశాలలు పెట్టి నీ పరిసరముల బాలుర నిర్భంధించి చదివించినచో నీ సంస్థానమెల్ల విద్యామయ మయ్యెడిది చాలమంది పండితులకు వృత్తి కల్పిత మయ్యెడిది అట్లు చేయక నాబోటి సామాన్యుc డెట్లో నిర్వహించు నీ పాఠశాల కేదియో యిచ్చి నేను చందోలు పాఠశాలకు ధర్మము చేసితినని చంకలు గొట్టుకొన నెంచితివి. ఇది మంచి ధర్మమెట్లగును? అనిరి, జమీందారుగారు అయ్యా! నాది దొంగధర్మమని యిప్పుడు తెలిసినది. మీ హితోపదేశము ననుసరింప యత్నించెదను అది యట్టులుంచుడు. మీరు మాత్రము తప్పక మాసంస్థానమున కొకసారి రావలయుననిరి. శాస్త్రిగారు - మీపాఠశాలల వ్యాపృతినిబట్టి యట్టి సమయములో నది చూచి యానందించుటకు వచ్చెదను కాని మీ ధనము కోసము రానని వారిని పంపివైచిరి.

ఇట్లే వారు ధనమును లెక్కచేయక ధర్మప్రధానముగ నడిచెడి వారు తమకు మిత్రులగు రైతుల వల్ల స్వతంత్రముగ నడిగి తెచ్చి విద్యార్థులc బోషించెడివారు. అవసరమని పిలిచిన సభలకు నరిగి సనాతన ధర్మవిషయమున నుపన్యసించుచుండెడివారు. అప్పటి కాలములో ప్రసిద్ధులవు తిరుపతి వేంకటేశ్వరకవులు మొదలగు వారు వారి నొక దైవతముగ జూచుచుండిరి. దీనికొక కథ-

నూజివీడు సంస్థానమున నొకప్పుడు శ్రీ తిరుపతి వేంకటేశ్వరకవులు నింక కొందరు ప్రముఖులుండ నా సభలో శ్రీ రాజుగారు ఇప్పుడు మన యాంధ్రదేశములో నున్న కవులలో ప్రథమగణ్యు లెవరని ప్రశ్నించిరి. దానికి చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రిగారు నా గొంతులో నూపిరియుండగా నాంధ్రదేశమున నాకన్నమిన్న కవి యనిన నేనెట్టు లొప్పుకొందును? నేనే ప్రప్రథమకవి ననిరి. అప్పుడు చందవోలు శాస్త్రిగారు వారి త్రిశంకుస్వర్గమను పొత్తము నాసభలో చదువుచుండిరి. వారి కవితా పరిపాటిని మెచ్చుచున్న రాజుగారు వెంకటప్పశాస్త్రిగారో? అని ప్రశ్నించిరి. చెళ్ళపిళ్ళశాస్త్రిగారు తాడేపల్లి వేంకటప్పయ్యశాస్త్రిగారు మహర్షియని సమాధానము చెప్పిరి. దానికి నెల్లరు నామోదించి వేంకటశాస్త్రిగారి వివేకశక్తిని గొనియాడిరి. ఒక సమయమున గుంటూరులో నొక సభలో వచ్చిన కవిత్వ ప్రసక్తిని గూర్చి వారి యభిప్రాయము-

చ|| పొలుతులు లేవునీకు రసపుష్టి యెఱుంగరు లోకులియ్యెదం

గగిమికిc గాన్క వెట్టుదురు కాలము దుష్టము భోజరుద్ర కృ

ష్ణులు కలిఢాకకుం దలcగి చూపున కబ్బరు నీదు ముద్దు మొ

ల్కలు వనిcగాయు వన్నెలలుగా నొగిలించెడుc గావ్యకన్యకా!

ఉ|| కొందఱు పిల్చియే ముదుకగుడ్డయొ కూడొ యొసంగి ప్రోతుమం

చందురు వారి భాగ్యమది యట్టిద యేమనవచ్చు నింక నీ

యందము చందముc దలcచి హావవిశేషము లేర్పరించి యే

లందగు నాధుcడెవ్వcడు? కలాలలితాత్మిక! కావ్యకన్యకా!

చం|| శివునకొ? రామకృష్ణులకొ? శీలము నెక్కొన నిన్ను భక్తి నీ

భవమున కెట్టులేనిడcగ భారము వాయునటన్న నీ యెడన్‌

నవనవమౌ వికాసము గనంబడ నొందెడవార లుండ మా

యవమతి యేమనంగ నగునమ్మ దయావతి! కావ్య కన్యకా!

అని యిట్లే మఱికొన్ని పద్దెము లాశుకవితలో నొడివిరి.

ఒకప్పు డొక క్రమపాఠిగారు వారి కవిత్వము నెఱుగక ఈభట్రాజు కవిత్వముల కెమిలే యనిరి. దానికి వారు వెంటనే-

గీ|| సర్వదోచ్ఛిష్ట పంకపంచయన మైన

కూపమం డూకమున కెట్లు కోరవచ్చు?

భట్టరాజాంక వేంకటప్పయ్య కవీంద్ర

వాగ్ఝరీ జృంభణ విలాసవైభవంబు.

ఉ|| పంచిన వేడ్క నీ నొసటc

బాటయె వ్రాసె విరించియైన నీ

తింబురుడించి మూలమని

తీరుగc జూచినc జూడ నీ కయి

ట్లంబరమూడ గంతులిడె

దంగములం గనలేని నీదు రా

స్యంబెవcడింక గన్గొనున

శక్తత కూలెదు ఛాందసత్వమా!

మ|| చయనంబుత్తది సోమమారడి విశిష్టంబైన యాధానమే

బయలెక్కెంగద వైశ్యదేవమయినం బాడాయె నేనాcడొ సం

చయనం బీవొనరించి నంతటనె శిష్టత్వంబు చేకూరెనే!

పయినంగ్రేజొక డెక్కుడాయెనటె? యోప్రాఢ్వాయ చాదస్తమా!

ఈ మూడు పద్దెములు నాశువులో చదివిరి. ఇట్టివియే అనేకములు వారి చరిత్రములో కలవు వారివలన చరిత్రములలో పేరు నొందిన చందోలు పురము నేడు మిక్కిలి ఖ్యాతివహించినది. దినమునకు 12000 పంచాక్షరీజపము చేయకుండ పండుకొనె వారు కారు. అఖండ శివపూజా ధురంధరులు. జపమాల ఎల్లవేళల తిరుగుచునుండెడిది. ఉపన్యాససమయమున మాత్రమది తూష్ణీంభావము వహించును అది యాగగనే యిది సాగుచుండెడిది; విద్యార్థుల పాఠములో, పంచాక్షరజపమో, ఉపన్యాసములో, కవిత్వమో తప్ప మరియొక పనికి నవకాశము లేదు. వారిరోజులలో నెలకు పదిబస్తాల ధాన్యము దంపించుచుండెడివారు. విద్యార్థులు, ఇంటిలోవారు, వచ్చుచు పోవుచుండు నతిథులు, బందుగులు గాక గ్రామములో నుద్యోగమునకు వచ్చినవారు కూడ వసతి కుదురువరకు నిక్కడనే యుండి వసతి కుదిరినప్పుడు చెప్పిపోవు చుండెడివారు. వారు సంచారము చేయు గ్రామములలో బీదవారలకు ధనసహాయము చేసెదనని తీసికొనివచ్చి వారలకెల్ల భోజనము పెట్టి వారిపని నెరవేర్చి ధర్మముగ పంపుచుండెడివారు. అట్టివార లేమైన నిచ్చెదమన్న ముట్టెడివారు కారు. అవసరమని వచ్చు శిష్యులకు వేదమంత్రములుగాని ఆగమమంత్రములు గాని పురాణమంత్రములుగాని వారివారి యధికారమునుబట్టి యుపదేశించుచుందురు కాని యొకకానియు వారివల్ల గ్రహించువారు కారు. ఇంతకు మూలమాతల్లి హనుమాంబ. విసుకులేకుండ వండి వడ్డించెడిది. ఆమెకు కోడలు ఆడుబిడ్డ తోడుగ నుండెడివారు. ఆమె చేయి యెప్పుడు నన్నములోనె యుండెడిది.

వీరు తిర్పతి వేంకటేశ్వరులకన్న ముందుగా నవధానము లొనర్చుటయు నదివిని వీరి గురువులవు శ్రీ అద్దేపల్లి సోమనాధశాస్త్రిగారు నీ సరసకవిత్వము చెడునుగాన నాకెఱుcగరాకుండ నీవెప్పుడు నవధానము, చేయవలదని వారించిరి. ఈ విధమున నలువది సంవత్సరములు విద్యార్థుల విద్వత్తములc జేయుచు, సంస్కృతాంధ్ర గ్రంథరచనల దేశము నలంకరించుచు, నుపన్యాసవిధి ధర్మప్రచారము సేయుచు, నఖండ దేవీదేవారాధనములం బ్రొద్దుపుచ్చుచు గొన్ని సాంసారికములవు చిక్కులున్నను విద్యానంద బ్రహ్మానందములతో దమ యాయువును సార్ధకమొనర్చికొనిరి.

చివరి దినములలో తాము వ్రాసిన శ్రీరామకథామృతము అనుగ్రంథము నచ్చువేయింపcబూని 20-60 లు చందా యిచ్చినవారికి అయిదు వాల్యూములు పొత్తము లిచ్చెదమని కొంత ద్రవ్యము సంపాదించి బాలకాండము 2000 ప్రతులు వేయించుట కదియెల్ల వ్యయముకాగా క్రొత్త చందాలతో మిగిలిన గ్రంథమును పూర్తిచేయనెంచి అయోధ్యాకాండము 17 ఫారములు ముద్రించుసరికి నతిసారరోగముతో బాధితులగుచు ముగ్గురు వైద్యులు వైద్యము చేయుచుండ వైద్యత్రయి యేమనుచున్నదని తమ కుమారు నడిగి వానివలన విధిప్రాతికూల్యము నెరింగికొని సర్వజ్ఞులు గాన చింతించి యేమి ప్రయోజనమని పై గ్రంథము నచ్చువేయించి చందాదారులకు నీవు స్వయముగా నిమ్ము. అట్లయిన వారితో నా చెప్పిన మాటలసత్యము కాకుండును అని కొమరునకుం జెప్ప నతండు 12000లు ఋణములు కలవు, కుటుంబపోషణము చేయవలెం గదా! ద్రవ్యసాధ్యమవు నీపనిగూడ నేనెట్లు చేయగలనన నాతదనంతరము నాకు నీచేయి నౌర్ధ్వదైహికము కొఱకైన వ్యయము చాలించి ఆ ధనము పెట్టి ప్రస్తుతము సాగుచున్న అయోధ్యాకాండ ముద్రణము నెరవేర్చి చందాదారుల కిమ్ము. నాకు కొంత బాకీ తీరగలదనిరి.

ఆ మహాగురుని మాటనుబట్టి కార్యము నావశ్యకత గమనించి కుమారుడు వారికి నమస్కరించి నాకు నప్పగించి పోవుచుంటిరి గాన మీకా ఋణము బాధకముగాదు. నేను రెండేండ్లు బ్రదికిన మీ శ్రీరామకథామృతము పట్టాభిషేకాంతము నచ్చొత్తించి చందాదారుల బాకీ తీర్చెదను మీరు సంతసింపుడు అని చెప్ప నాయన సంతసించి ఉత్తరకాండములో షుమారు 1500 పద్యములు వ్రాసితిని. ఇక 6000 పద్యములు వ్రాయవలసియున్నది. అవికూడ నీవేవ్రాసి పూర్తిచేయుము అని వాక్రుచ్చి తరువాత రెండుదినములకే అనగా భావసంవత్సర ఆశ్వయుజ బ 3 లు నాడు భౌతికశరీరము వదలి యుపాస్యస్వరూపులైరి. ఇది శ్రీ వేంకటప్పయ్యశాస్త్రిగారి సంగ్రహ చరిత్రము. విశేషించి వ్రాయవలెనన్న నెంతయేని కాలము పట్టును.

తదనంతరము వారి కుమారుడు శ్రీ రాఘవనారాయణశాస్త్రి వారితో చెప్పినట్లు చేయవలసిన భారముతో మొదలు ముద్రాశాల కధిపతియవు మ. రా. శ్రీ పాములపాటి వెంకటకృష్ణయ్యచౌదరి, నిడుబ్రోలు గ్రామవాస్తవ్యు నాదరము నెనసి ఎట్లెట్లో అయోధ్యాకాండము పూర్తిగా ముద్రింపించి చందాదారుల కిచ్చెను.

సదరు చౌదరిగారు విశాలహృదయులు, తమ పినతండ్రికి వేంకటప్పయ్య శాస్త్రిగారికి స్నేహసంబంధమును, తమకు దగ్గర గ్రామమున నున్న కవికావ్యము ప్రసిద్ధికి వచ్చుట ముఖ్యమని సరసులగుట మొదటనే చాలతక్కువ రేటుతో నొప్పుకొని వారి తదనంతరము వీరు పూర్తిచేయవలసినందులకు మిక్కిలి సహాయముచేసి కీర్తిని, పున్నెమును సేకరించిరి.

గుంటూరు వాస్తవ్యులు శ్రీ మ. రా. శ్రీ గోవిందరాజుల సత్యనారాయణ, వీరు వకీలు, లక్ష్మినరసింహరావుగారు డాక్టరు - వీరు సోదరులు, వీరి తల్లి శ్యామలాంబ యోగిని, తండ్రి భాగ్యవంతుడు. ఈ కుటుంబము శ్రీ వేంకటప్పయ్య శాస్త్రిగారిపై భక్తితో వారి కుమారుని పిలిపించి వాని స్థితిగతుల విమర్శించి మూడేండ్లు గుంటూరులో తత్కుటుంబము నునిచి కోమటిబజారున నొక పురాణము కుదిర్చి యీ పురాణముతో కుటుంబ పోషణము చేసికొనుమనియు మేము కొన్ని చందాలు వేయించెదము, వానితో తండ్రిగారి గ్రంథము పూర్తిగా నచ్చొత్తింపుమని మీ యాస్తితో వెనుకటి బాకీలు తీర్చుకొనుమనియు తగినంత సహాయము చేసిరి. వారి యండతో నీ పనులెల్ల నెరవేర్చుకొని మూడేండ్లు తెనాలిలో నుండి తరువాత మరల చందోలు చేరి యథాయథముగ నుండెను.

శ్రీ రాఘవనారాయణశాస్త్రి స్వస్తి శ్రీ దుర్ముఖినామ సం||ర శ్రావణ బ 2 లు మంగళవారము రాత్రి వృషభలగ్నమున జన్మించెను. జన్మస్థానము గుంటూరునకు మూడుమైళ్ళలో నున్న గోరంట్ల అది మాతామహస్థానము. మాతామహుcడు అన్నంభొట్ల వేంకటప్పయ్యగారు మాతామహి వెంకటసుబ్బమ్మగారు. వీరికి పురుష సంతతిలేక మఱదలి కొడుకును బెంచుకొనిరి. ఆయన వేంకటరామయ్య మేనమామ. వాని భార్య ఈ శాస్త్రిగారి పినతల్లి కూతురు త్రిపురసుందరి. వీరికి సంతానము కల్గి నష్టమౌటచే నతని యన్న మనుమని బెంచుకొనిరి.

శాస్త్రిగారి జాతకచక్రము

శని దశాశేషము షుమారు 10 సంవత్సరములు.

ఈ జాతకుడు 6వ సంవత్సరమున బజారులో నొకడుపన్యసించు చుండుటను జూచి యింటికి వచ్చి దొడ్ఢిలో నున్న టేకుదూలముల మీద నెక్కి పై యుపన్యాసము ననుకరించుచు కాలుజారిపడి తద్ధ్వారముగరుగ్నుడై ఒక సంవత్సరము జీవిత సంశయమున నుండెను.

తరువాత మూడు సంవత్సరములు బడిచదువులో కాలము గడిపెను. నాల్గవ తరగతి చదువుచుండ నొక పరీక్ష పంతులు తుందిలిcడు వచ్చి, కుర్చీ వేయగా గబుక్కున కూర్చుండెను. వాని బరువును భరింపలేక అది విరిగెను. దానికి నీ జాతకుడు నవ్వెనని యాయన పరీక్షc దప్పించినాడు. తరువాత పదియవనేట నుపనయనము జరిగినది. అయిదుగు రాడుపిల్లలలో నొకండె పుంస్ఫుత్రు డగుటవలన తలిదండ్రులు గారాబముగc బెంచిరి. సంవత్సరము రుగ్నుడని తండ్రిపై గౌరవమున మ. రా. శ్రీ మాచిరాజు దండయ్య పంతులుగారు గారాబముగా మిఠాయి కొనిపెట్టుచు చదువు చెప్పెను, ఉపనయనమైన తర్వాత పై#్రవేటుగా నాంగ్లభాష చదువుమని పై పంతులుగారి అన్నకొడుకు సాంబయ్యవద్ద నప్పగించబడెను. కాని యా చదువుమీద నిష్టములేక సంవత్సరము వ్యర్థముగాc బుచ్చెను.

అప్పుడు యడ్వర్ఢు పట్టాభిషేకము. ఆ సమయమున వానలు మెండయి పంటలు పైరులు కొట్టుకొనిపోయెను ఆ యుద్రేకములో - యడ్వర్డు చక్రవర్తి ముండచక్రవర్తి - అని కొన్ని పద్దెములు వ్రాసెను. అది సహజమవు కవిత్వము.

ఉపనయనము నాటినుండి సంధ్య నేమరక రెండుపూటల నగ్ని కార్యము నొనర్చుచు నొంటినిండ రుద్రాక్షల పేరులు, నతిశయితమవు భస్మధారణము చూచువారలకు నడనిమానిసివలె బైరాగివలె కన్పట్టెడువాడు. తరువాత తండ్రి చదువుట లేదని శిక్షింప నానాదేశముల నుండి వచ్చిన విద్యార్థులు మీ వద్ద పండితులై పోయి గౌరవ మందుచుండ నాకీ యాంగ్ల విద్య యేల! ఇది నేను చదువను. వేదముగాని శాస్త్రముగాని చెప్పిన చదివెద ననెను అప్పుడు తండ్రిగారు కావ్యారంభము చేసి చెప్పుచుండ కావ్యనాటకా లంకారము లభ్యసించుచుండెను. ఈ లో తాడికొండ కేదార లింగముగారు పై దండయ్యపంతులుగారి యల్లుడు ఉపాసకుండు తండ్రి గారి యనుమతితో పన్నెండవయేట బాలామంత్రము నితని కుపదేశించెను. అప్పటి నుండి పదియారవ వర్షము దాక బ్రహ్మచర్య వ్రతముతో చదువును గూడ మెచ్చక అధికముగా నమ్మంత్రరాజము జపించుచుండెను. రఘువంశము పాఠము మొదలు ములుగు వీరభద్రయ్యశాస్త్రి యను పితృసఖ పుత్రుడు సహపాఠి అయ్యెను. ఆయన చాల గురుభక్తుcడు, మైత్రీపాత్రుcడు వాని ప్రేరణతో నప్పుడు దేశములో జరుగుచున్న తిరుపతి వేంకటేశ్వరుల యవధాన ప్రచారమును బట్టి మనము మాత్ర మవధాన మేల చేయరాదు అని విద్యార్థుల కూర్చుండబెట్టుకొని పదియేనవునేట చాటుగ నర్ధశతావధాన మాచరించెను అది వాటముగా కుదిరినది.

ఆ కాలమున నిజాంపట్నములో కోట రామకృష్ణశాస్త్రి యను బంధువుడు లక్ష పత్రిపూజ చేయుచు నాహ్వానించిన సహపాఠులతో నచ్చటికి పోయి వారి కోరికc దీర్ప నచ్చట అష్టావధానము నొనర్చెను. అప్పుడు వేమవరాగ్రహారమునc దిర్పతి వేంకటేశ్వరులు శతావధానము చేయుచుండ, అవధానానంతరము కవులెల్ల పద్ధెములు చదువుచుండ నీ బాలుండును-

శ్లో|| విషధిస్ప శేష ఉదితః పరమై

రభివాదితః కపటవాన్ధిషణః

కవిరవ్యయం దనుజబంధు రహో

సకణాద ఏవ మతిమాంస్తదపి ||

శ్లో|| వ్యాకృతి ప్రముఖశాస్త్ర వినీతౌ

తౌవిషాది రహితౌ కవిహీరౌ

శేడ పూర్వ విషపూర్వవతాం య

స్యాంశజౌ నహి మహిః పరమేతత్‌||

అని చదివెను. వెంటనే వేంకటశాస్త్రిగారు ఈ భారవిభ##ట్టెక్కడ నుండి వచ్చెననిరి. వీరి తండ్రిగారు మాయబ్బాయి యని చెప్పగా నేమి చదువుచున్నాడనెను. భారవి కావ్యమన, నట్లయిన నైషధ కావ్యము చెప్పుము శ్రీ హర్షభట్టగు నని దీవించిరి. తరువాత కొన్ని దినములకు కుమారుడవధానము లొనర్చుచున్నాడని విని వారివద్ద నొకసారి విద్యార్థులను పృచ్ఛకులుగా బెట్టి యష్టావధానము చేయించి, సంతసించి, యభ్యనుజ్ఞయిచ్చుచుc జదరంగము, చీట్లాట స్వయముగ నేర్పిరి.

ఇంతలో పదియారవనేడు వచ్చినది. చిన్ననాటనుండియు పిల్లలతో నాటలాడుటకు నీయన పోయెడివాడు గాడు ఎప్పుడు నొంటరిగ నుండుట, చదువో, సంధ్యయో, జపమో యభ్యసించుచుండువాడు. అప్పటికి కొంత వైరాగ్యము కుదిరి తల్లికి నమస్కరించి సన్యాసమున కనుజ్ఞ నిమ్మని వేడెను. ఆయమ చాల దుఃఖించెను. ఆ సందర్భము విని తండ్రిగారు బొడ్డూడని వారికెల్ల వైరాగ్యము, సన్యాసము అంత తేలికగా నున్నదియా! యని చీవాట్లు పెట్టిరి. ఒకప్పుడు ఊరిబయట నొక్కడు పొదలలో మధ్యc గూర్చుండియున్న కొడుకునుచూచి తండ్రిగారు నిశ్శబ్దముగా పోయి దగ్గఱకూర్చుండి వృత్తిలయమై లోకమెఱుcగకున్న వాని విమర్శించి, ఒడలుతెలిసి లేచిపోవుచున్న వాని చేయిబట్టుకొని సన్యాసోద్యమమును సత్యమని నమ్మి, అది మొదలు నిత్యము ధర్మబోధ చేయమొదలిడిరి.

తక్కినవార లాడుపిల్లలు. నీ వొక్కడవే మాకు మగపిల్లవాడవు. నీ వెట్లు సన్యసించిపోనగును! మాకు వంశము నిలువవలదా? నీకుమాత్రమిది విధియా? ఋణత్రయము తీరనిదే సన్యసించిపోరాదుకదా! యని యనేకవిధముల ధర్మబోధ చేయుచుండెడివారు. ఇట్లుండ నొకనాడు రాత్రి స్వప్నములో పిన్నతల్లివలె నుపాస్యదేవత కనబడి, ఒక పటమునుజూపి దీని నాకిమ్మని యడుగ, నిచ్చుటకే దెచ్చితినని, నీకు గజాంతైశ్వర్యము నిచ్చెదను. త్యాగము నభ్యసింపుము. ప్రత్యక్షసన్యాస మిప్పుడు కాదులేయని యంతర్థివహించెను.

ఆ మరునాడే బందరు పోవుచున్న తండ్రికి కృష్ణానది రేవులో కుంకుమ భరిణయు, కాటుకకాయయు దొరకెను. వాని గ్రహించి యానాడు చల్లపల్లిలో నున్న శ్రీ అద్దేపల్లి సోమనాధశాస్త్రిని స్వగురువరుc జూడ బోవుటయు నాగురుమూర్తి యీ శిష్యుని సంసారవిషయమై ప్రశ్నించి కొడుకునకు పెండ్లిచేయలేదేమని యడిగి, సంబంధములు వచ్చుచున్నవి ఇంటికి వెళ్ళగానే ఏదియో నొకటి నిశ్చయము చేయవలెనను శిష్యునితో నాకు చెప్పకుండ నీ వట్టి నిశ్చయము చేయకు మనెను. అది యేమన నా వద్ద నా తమ్ముని కూతురు పెరుగుచున్నది. దానికి వివాహము చేయవలెను. ఆ సన్నాహమెల్ల నే నొనరించెదనన్న గురుని మాటకు నొడంబడి బందరు పోయివచ్చిరి. ఇంతలో వారి తరపువారు వచ్చి చూచి నిశ్చయించుకొని పోయిన తరువాత, కొందఱు విభూతి రుద్రాక్షలు ధరించును. ఈ కాలము వాడుకాదు, వాని కిచ్చుటకన్న ఈ పిల్లకు పెండ్లి చేయకుండుట మంచిది, అని శ్రీ శాస్త్రులవారికి చెప్పుటయు నాయోగి - నేను విభూతి పూసుకొనుట లేదా! నాకు రుద్రాక్షలు లేవా! నాయల్లుడు నాయట్టివా డగుట మరియు మంచిది యని వివాహ ప్రయత్న మొనరించెను. 19వ యేట వివాహము జరిగినది. ఇక సన్యాసము పోయినది. సంసారము ప్రారంభ##మైనది.

కాని యీ యాటకు తగినవేసము, బాస గ్రహింపవలెనని తండ్రి గారితో చెప్పకుండగనే తెనాలివెళ్ళి శాస్త్రాభ్యాసము చేయవలెనని ప్రయత్నింపగా నచ్చట పాఠశాలలోc జేరియు సనువుపడక వివారించుచు, నీ లోపల శ్రీ పీనపాటి మృత్యుంజయ అయ్యవార్ల కొడుకు వీరభద్రశాస్త్రి తోడుగా నాయనవలన నేత్రావధాన మభ్యసించి అదివర కాయనతో నవధానముచేయు యేలేశ్వరపు పురుషోత్తమశాస్త్రి, రాఘవయ్య అను వారలతో సఖ్యము కుదిరి తన కవిత్వాదుల వారి కభ్యపింపc జేయుచు, వారితో నభ్యసించిన నేత్రవధానమును నిత్యము సభలలో ప్రదర్శించుచు నుద్యోగి ప్రవరులతో పరిచయము కలిగి వారలవల్ల షుమారు 400 సర్టిఫికెట్టుల సంపాదించి గవర్నరవు పెంట్లెండు అనువాని సఖ్యము సంపాదించి తిరుగుచు నిది శాశ్వతముకాదు. ఈనాటి గౌరవము రేపుండదు. శాస్త్రపఠనమే ముఖ్యమనితోచి వెంటనే తాడికొండ యను గ్రామమునకుc బోయి తన గురువవు కేదారలింగముగారి యింటనుండి తత్పురవాస్తవ్యులవు శ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రులవారిని ప్రదోషానంతరము దర్శింపబోయెను. గురువర్యులకు నమస్కరించిన వెంటనే యాయన శిష్యుని యుదంతము నారసి చదువుకొన వచ్చితినన నిప్పుడే మొదలు వెట్టుమనెను. పుస్తకము కేదారలింగము వారింటివద్ద నున్నది. మీ దర్శనముచేసి యాజ్ఞతీసికొనుటకు వచ్చితిని. రేపు పాఠము మొదలుపెట్టెదనన నా కారుణ్యనిధి నా పుస్తకమిచ్చెదను, ఇప్పుడే మొదలుపెట్టుమని వైయాకరణ సిద్ధాన్తకౌముది నొసగి యప్పుడే పాఠము చెప్పిరి. అట్లు నాలుగువత్సరము లా గురుదేవు నాశ్రయించి తాడికొండ గ్రామమున విద్యాభ్యాసము చేయుచుండెను. ఈయన పితృసఖుడవు నాయూరి రెండవకరణము బ|| వెంకటచలం పంతులుగారు అంతకుముందు శ్రీ శాస్త్రులవారివద్ద కావ్యపాఠమొనర్చు వంగల వెంకటరామశాస్త్రి ద్వారా వాని తలిదండ్రులు, సుబ్బయ్య శాస్త్రిగారు మొదలైన గృహస్థులు పరిచయమై తమ బిడ్డకన్న నెక్కుడుగా చూచుచుండ దివ్యముగా నచ్చట విద్యాభ్యాసము కుదిరినది.

శ్రీ ముదిగొండ నాగలింగశాస్త్రిగారు వీరు ఆరాధ్యులు. భారద్వాజస గోత్రము. శ్రీ కుంభకోణం శ్రీనివాసశాస్త్రులవారి శిష్యులు. అనేక శాస్త్ర సంప్రదాయములు వారివల్ల గడించినవారు. నైక గ్రంథకర్తలు ఇవి యన్నియు నిట్లుండ శ్రీ నీలకంఠభాష్యానుసారం, వ్యాసపథము, బ్రహ్మపథము మొదలవు గ్రంథములు వ్రాసి శివ విశిష్టాద్వైతమును ప్రచారము చేసిన ప్రసిద్ధులు. చాలమంది వారిని ఋషియని ప్రశంసింతురు. అట్టివారు వీరికి వ్యాకరణశాస్త్రము పాఠము చెప్పుటయకాక వేదాంతశాస్త్రమునc గూడ పరిచయము కలిగించిరి. శాంకర రామానుజీయ మధ్వ భాష్యములలో నున్న విశేషములు చదివిచెప్పుచు వారి ఫక్కి వినిపించి వ్యాఖ్యానము చేయుచుండెడివారు. వారితో గొన్నిదినములు సంచారము చేయుచు నెడనెడ శతావధానాష్టావధానములు చేయుచు కేవల విదాప్రసంగముతో కాలము గడిపిరి. అచ్చట వీరికి శ్రీ గురువుగారి మేనయల్లుడు, అల్లుడునవు శ్రీ మల్లంపల్లి జ్వాలావీరభద్రశాస్త్రి సహపాఠిగ నుండెను.

అప్పటి సమయమున వినుకొండ తాలూకాలో సంచారము చేయుచున్న శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధినాథ శ్రీ చంద్రశేఖర భారతీస్వామివారి వద్ద నొకసారి యష్టావధానము కావించిరి. వీరిని చూడcగనే వారు ''అహమేవా శ్రమాంతరేణాగతః'' అనిరట. అక్కడ విద్వాంసులుగా నున్న వారెల్ల చిన్నతనములోనున్న వీరిని గట్టిగc బరీక్షించిరి. అప్పుడు 20వ సంవత్సరము, ఒక యుదాహరణము.

ఒక విద్వాంసుcడు కంకంటి పాపరాజుగారి యుత్తరరామాయణముc బురాణముగా చదువుచు పది కాగితములుతీసి ఒక పద్దెము, మరియొక బొత్తితీసి అక్కడ నొక పద్ధెముగా చదువుచుండc బురాణమునకది పద్ధతిగాదని యవధానిగ రనిన నది లెక్కసేయకపోగా శ్రీ స్వామివారు చెప్పినను వినక అవధానమున నిట్లే పరీక్షచేయవలెనని చెప్పెను. దానికి నవధానిగారు చిన్నతనమగుటవలన నతిక్రమించి నీ నవధానముల మొగమెపుడైన జూచితివా? యనెను. దానికి నా ప్రముఖుడు నే నీ పురాణము చదువనని పుస్తకము విసరిగొట్టెను. అప్పుడు ఇంద్రగంటి శ్రీరాములుగారు అనే ఫారెస్టు ఆఫీసరు, వృద్ధుడ నేను చదువవచ్చునా? యని యడిగెను. అక్షరములు వచ్చినవారెల్ల చదువవచ్చునని యవధాని యనెను. ఆఫీసరుగారు షష్ఠాశ్వాసమున సీతారామ వనవిహారమున వర్ణనము చదువనారంభించెను. అవధానిగారి కీ తగాదాతో మనసు చికాకయి ''వసుధాజంబు లగంబులౌట'' అను పద్దెము అర్థముకాలేదు. ఇంకొక పర్యాయము చదువుమన అవధానములో నట్లు చదువవచ్చునా? యనిరి. అంత నవధాని గారు తనకు తోచినమాట లర్థముగా నుడివిరి. ఆఫీసరుగారు దీని కిదియేనా యర్థమనిరి. ఇప్పడు నీ కడుగు నధికారములేదు. అవధానానంతరమడుగుమని యవధానిగా రనిరి. ప్రత్యక్షర నిషేధాక్షరి - మల్లాది ఆంజనేయశాస్త్రిగారు రెండుమూడక్షరములు నిషేధించుచు, నదియేమనిన నివికాక మరియొక వర్ణము లేదా? యనిరి. వేదములో నొక ఋక్కు వ్యస్తాక్షరిగా బెట్టి దానిలో నక్కడక్కడ నక్కరముల లోపింపcజేసి స్వరములోc జెప్పుమనిరి. ఇవ్విధమున నవధానము నెరవేరినది. గంటలుకొట్టు ఘనుడుగాక శ్రీ స్వామివారు నొక కాగితముమీద గూఢముగా లెక్కవేసి యుంచిరి. అది తెలియక పృచ్ఛకు డది తప్పెననెను స్వామివారి లెక్కకు సరిపోయినది అప్పుడు అవధాని ఆరాగా మ్రోగిన గంటల చెప్పెదమని చెప్పc జొచ్చిన నది సరిపోయెననెను. అది సరిపోతే నిదియు సరిపోవును కూడికరాని వాడవధానిని ప్రశ్నించిన నతడేమిచేయు ననెను.

ఈ విధమున నెనిమిదిరకముల పృచ్ఛకులును నిందేమియు లోపము లేదనిరి. అనంతర మాఫీసరుగారు నా పురాణము మాత్రమే అవధానిగారు చెరచిరనిరి. అవధాని మరల నాపద్దెము చదువు మని పదస్వారస్యములతో గూడ దాని యర్థము నొడివిరి. ఆఫీసరుగారు ఇందాక యిట్లు చెప్పలేదనిరి అవధాని-ఇందాక చెప్పిన దేదియో మీరు చెప్పిన నిప్పుడు చెప్పినదానికి, దానికి భేదమేమో యాలోచింతు మనిరి. శ్రీ స్వామివారు మెచ్చుకొనుచు సభ ముగించిరి ప్రొద్దుకుంకుసరికి వీరికి నపరిమితమవు జ్వరము వచ్చి ఒడలు తెలియకుండc బోయినది. శ్రీ మల్లాది ఆంజనేయశాస్త్రిగారు చెప్పగా శ్రీ స్వామివారు విభూతి మంత్రించి పంపిరి. అది ధరింపగానే తగ్గిపోయినది మరునాడు స్వామివారు నవ్వుచు దృష్టి మంత్రమైనను రాని వాడవేమని యాస్థానులకు వచ్చితి ననిరి. గురుస్వామిని దర్శించుటకు మంత్రము లేల? మందులేటికి నని వీరనిరి. ఇంతలో తొలినాడు పురాణము చాలించిన విద్వాంసుడు వచ్చి ఈయన మంచి సంప్రదాయము వాడని మీరు చాల అభిమానించుచుంటిరి. ఏమి సంప్రదాయము? వీనికి మీసమేటికి యని యాక్షేపించెను. శ్రీవారు సమాధానింపు మనిరి. అప్పడుశాస్త్రి

సీ|| ఆవస్పశంబు దివ్యాకృతి వ్యాకృతి

వరియించి మించె సద్గురుని యుక్తి

కష్టభాషా కవితాంగనామణి తనం

తన చేరెc బూర్వజన్మంపుc జెలిమి

నష్టావధాన నేత్రావధాన శతావ

ధాన విధాతృత ధాత గూర్చె

వచ్చును ద్యద్వయః ప్రౌఢిc బాణిగృహీతి

కాపురం బొనరింప రేపొ, మాపొ,

గీ|| తల్లి దండ్రి సజీవులై తవిలి తనదు

సేమ మారయుచుండి రాశీస్సు లిడుచు

నెన్ననగు ప్రాయమందుంటి నిపుడు గాక

మీస ముంచెడు సమయంబుమీద గలదె?

అని నొడువ శ్రీ స్వామివారు ''శోభ##తే చాస్త్వేవ'' అనిరి.

తరువాత ప్రసక్తాను ప్రసక్తంబుగా తామరయను పొడను గూర్చి ప్రసంగము రాగా

గీ|| బొడ్డుతామరవానికిc బుట్టినాcడు

ముడ్డితామరవాcడు సముద్వహించె

కేలి తామరదానిc దత్కృత జగములc

దామరల కేమి? తామరతంపరయ్యె ||

అని శాస్త్రిగారు చెప్ప సదస్సు చమత్కృతమైనది. శ్రీ స్వామివారు ఉభయ శ్లేషాలంకారమునకు లక్ష్యముగ నేవిషయమున నైన నొక శ్లోకము చెప్పుమనిరి.

శ్లో|| యస్యాష్ట భాషాకవితా లతాంగీ

జాయేవ నీతా ప్రణయేన శయ్యాం

మనోహరంతీ ఖలు హావభావైః

కీర్తిం ప్రసూతే భువనాభి వంద్యాం !!

అని వీరు వచించిన స్వామివారు సెజ్జయందు పరివర్తన మొనర్చుచు- స్త్రీ సంతత్త్యే వాస్యప్రతిష్ఠేతి స్ఫురతి - అనిరి. వారి సంస్థానమున నుండు మనిన చదువుకొను రోజులలో నిది కుదరదని వారి యాశీస్సులతో ఫలమంత్రాక్షతాదులc గొనివచ్చిరి.

ఈ విధమున వెల్లటూరు, వేల్పూరు మొదలైన గ్రామముల యందు నవధానము లొనర్చుచు దిరిగిరి. ఇట్లు కాలము పుచ్చుచు నింటికి జూచిపోరాగా సంసారము బహుఋణములతోc బై బడెను. అప్పుపుట్టదు. నిలవ ధాన్యములేదు. అట్టితరి మూడుదినములు ఉపవసింపవలసి వచ్చెను. మూడవ దినమున 27 పర్యాయములు సహ్రసనామార్చనము చేసి దేవి మందిరము నొద్ద పండుకొన, కలలో గలగలమని వచ్చి పదియేండ్ల బాల ఓరీ! ముష్టి పెట్టెదననిన ఈయన పై కొంగు జాచcగా దోసెడు బియ్యము తళుక్కుమనc బెట్టినది. బండివచ్చును దానిపై నేగుము మేలగుననెను. మెలకువ వచ్చినది. మరికొంత సేపునకు ఖాజీపాలెమునుండి బండి వచ్చినది. దానిపై నేగ వారు పురాణము గోరిరి. అడుగకుండగనే రాత్రికి పుట్టెడు వడ్లు పంపిరి అది మొదలు దారిద్య్రము నెఱుగకుండ నెప్పుడు, దైన్యములేని జీవనము నింతదనుక యాదేవి కనిపెట్టియే నడుపుచున్నది.

పై చిక్కుల దినములలో కలలో యుత్తమర్ణుడు బాధింపగా నిసువుతో

శా|| కావ్యశ్రీ! చనుమా, త్వదేకరతునిం గామింతు వస్టావథా

నావ్యాజ ప్రతిభా! యొనర్తు వెది? నిర్వ్యాపారునిం గూడి ది

వ్యవ్యాహార సతీమణి తొలcగు మెందైన న్ఖలుండీ ఋణా

ర్ణ వ్యాపారఝరీభ్రమిభ్రమరుcడేనా మిమ్ముc బోషించుటల్‌ !

అను పద్యము చెప్పబడెను. ఆ సమయములో నొక యుద్యోగితో సంబంధము కలిగి ఆయన తన కవిత్వము వినిపించి యడుగగా మీ కవిత్వము చూచిన మీమీద కవిత్వము చెప్పవలె ననిపించుచున్నది. అన నైన చెప్పమని యాయన నొడువగా-

శ్లో|| విద్యానందిత సత్కవీశ హృదయా భోజాది భూమీ భుజః

ప్రాగాసన్నితి విశ్రుతిం కలియుగే శాబ్ధాత్ప్రతీమఃకథం

అప్రమాణ్య మతిస్ఫుటం హ్యుపమితేః కృష్ణార్య ప్రత్యక్షత

స్త్యాం కృత్యాద్య సపక్ష మేతదఖిలం బుద్ధాను మాయామహే !

అని చెప్పిన శ్లోకమును విని యా యుద్యోగి సంతసించి యారనముతో నొకcడు ప్లయంటు చేయcబోయిన చందోలు శాస్త్రులవారిమీద ప్లయంటు నీకోర్టుతో పట్టము అనెను ప్లీడరు-పార్టీ నష్టవడునన నా యధికారి ఆ తరువాత నేను నష్టపడినను సరే అనెను. తరువాత దేవాతానుగ్రహమున స్థిరాస్తి యెల్ల ఖర్చుపెట్టి బాకీలు తీర్చిరి.

తరువాత మనశాస్త్రిగారు తండ్రిగారి గ్రంథముద్రణమునకు పూనుకొని యయోధ్య కాండములో గాయత్రి యందలి భపర్ణముతో పద్యము వ్రాయనెంచిన మూడురోజు లొక కందపద్యము కుదురలేదు. దానికి నాశ్చర్యపడి యుపాస్య దేవతా ప్రార్థన మొనర్చి నిద్రించుచుండc గలలో నొక బీబీ ఎఱ్ఱని గుడ్డకట్టి, కుంకుమాక్తమవు చొక్కాయి తొడిగి ఒక వేదికమీద పండుకొనెను. ఆమెవద్ద షుమారు 30 ఏడుల యీడు గలిగి పెద్ద బారయిన గడ్డముగల యొక పురుషుcడు చొక్కాయి పైకెత్తి పాలు త్రాగుచుండెను. శ్రీ శాస్త్రిగారిది దారినబోవుచు జూచి నిలుపనామె యర్థనిమీలితాక్షిసమీక్షణమున తృణీకృత బ్రహ్మిపురందరాదికమవు విభవమున గాంచుచు నేల నిలచితి వనెను. శాస్త్రిగారు నాకుగూడ కొంచెము పాలిచ్చెదవేమో? అని యడిగెను. అప్పటి యనుభవము నీరీతిగా కలలోనే పద్దెము చెప్పిరి.

చ|| ఎగcబడి త్రాగు కావలసె

నేనని త్రాగుచుc బాలులేవు పూ

ర్తిగ నొక గ్రుక్క కేనని స

బ్రీతి మెయింగని కందపద్దె మ

ల్లగ నవి చాలుపొమ్మని య

లక్ష్యతకై స్వకవిత్వధార సా

ధ్విగc బెనుపొందc జేసిన స

తిన్‌ యవనిం దలతుం దదాస్తికిన్‌ ||

ఆ వెంటనే 'కం|| భర్మమయ రమ్య హర్మ్యము' లను పద్దెము కుదిరినది అప్పటి నుండి యుత్తరకాండమున రేపు అచ్చునకుc గావలసినందకుc బైగా పద్దెము లీరాత్రి వ్రాయుచు పవలెల్ల ప్రూపులు దిద్దుచు గ్రంథము పూర్తిచేసిరి.

ఒకనాడు వేకువజామున బెజవాడ రైలుదిగి కృష్ణాస్నానమున కేగుచున్న శాస్త్రిగారికి బందరుకాల్వ వంతెనమీద కూర్చున్న యనిరూపణీయమగు నొకవ్యక్తి రమ్మని పిలచి వంతెనమీద తూర్పుగాc గూర్చుండుమని నేను మొగము కూడ కడుగుకొనలే దనుచున్నను నా మాటలలెక్కసేయక గణపతి మంత్ర ముపదేశించి జపించుచుc జూచుసరికి సదృశ్యమై చనెనట.

బ్ర. వే. పొదిలె సీతారామయజ్వశాస్త్రిగారు మహతియగు విద్దె నాదరమున నుపదేశించి శ్రీ విద్యారహస్యముల నిర్దేశించి శాస్త్రిగారి హృదయమున గురుపీఠ మధిష్ఠించిరి. మాచిరాజు దండయ్య పంతులుగారు వర్ణగురువులు వారి యన్నకొడుకు సాంబయ్య చిన్ననాటి నుండి యాసనములు వేయించుచు చిన్నప్పుడు వ్రాయ, జదువనేర్చి పెద్దయము కవితాది రచనల నలంకరించు వీరినిc జూచి యనంతానందము నందువారితో నతిముఖ్యుడు మరియు మాచిరాజు రామమూర్తి (కరణము) చిన్ననాటి సఖుడు సర్వ వ్యవహారసహాయుడు వేదాంతం కృష్ణమాచార్యులు అను వైఖానసులు, వైద్యులు నేతత్పితృ సఖులు వారి వైద్య విద్యా ప్రావీణ్యమున నే బ్రదికితినని శాస్త్రిగారు చెప్పుచుందురు. వీరి యన్నకొడుకు శ్రీ జగన్నాథాచార్యులు, నేడు పెద్ద పండితపదవి నుండుటవలన, వేంకటేశ్వరస్వామి వద్ద నధికారియగుట వలన, చిహ్నభేదములచే కొంచెమెడపడినను, చిన్ననాటి మిత్రుcడనక తప్పదు. చింతలపాటి వేంకటసుబ్బయ్యగారు బ్రహ్మోపదేశ గురువు. పరిమి నరసింహావధాని యత్కించిద్వేద గురువు.

ఈయనకు 40వ సంవత్సరమున తండ్రియు, 43వ సంవత్సరమున తల్లియు కీర్తి శేషులైరి. తత్కర్మానుష్ఠానానంతరమున యథావకాశముగc గాశ్యాది క్షేత్రతీర్థమూర్తి రాజముల సేవించుకొని వచ్చి వైశ్యదేవమొనర్చి స్మారాగ్ని నుపాసించుచు చేతనయినంత వరకు స్నానసంధ్యాదుల ననుష్ఠించుచు చందోలు గ్రామములో తమ తండ్రిగారు కట్టిన పాఠశాలలో రెండుగదులు గోడపెట్టి పరిమి రంగరాయునకు శాశ్వతముగ నిచ్చి మూడు గదులు తన తమ్ముని బిడ్డల స్వాధీనములో నుండ, అల్ల డాబామీద స్వంత ఖర్చుతో నొక పూరిల్లు వేసికొని యందు నివసించుచు భగవంతుడను గ్రహించిన మంచిది లేకున్న నుపాదానమున కేగుదునని దీక్షవహించి విద్యావ్యాసంగముతో కాలము గడుపుచుండిరి. షుమారు 30 సంవత్సరముల నుండి యుపాదానమున కేగకుండనే ధైవము కాలక్షేపము జరుపుచుండెను,

వీరు కొంచెము జ్యోతిషము, కొంచెము వాస్తువు తెలిసినను వానిని జీవికకు నుపయోగింపక యయాచితముగ లభ్యమవు ధనమున తృప్తి నొందుచు తనకు తెలిసిన విద్యాదు లొరులకు ఫలాపేక్ష లేకుండ నుపయోగించుచు నుండిరి. వీరికి కాలమున నరసాపురము నుండి వచ్చుచుండ చోరప్రమాద మొకటి తటస్థించినట్లు పూర్వాశ్రమమున షుట్టి నరసింహశాస్త్రి యను పండితకవి అగ్నిపరీక్ష యని యొక పొత్తము వ్రాసినాడు. విశేష మా గ్రంథమువల్ల నెఱుcగునది ఈ శాస్త్రిగారు తండ్రిగారి శ్రీరామకథా7మృతమందు 6000 పద్దెములు వ్రాసిరి. అది ప్రసిద్ధమే. దత్తభాగవతము మొదలవు కొన్ని పొత్తములు వ్రాసిరి యామావికలో-

సీ|| మధురావిజయకృతి మాలిమి నొసcగితి

గురుcడైన నాగలింగునకుc గవికి

హనుమకిచ్చితిని సీతమ్మకోర్కికి ''సత్య

నారాయణ మహత్త్వ'' నామగాథ

కళ్యాణ కైవర్తకము సతీర్థ్యుండని

పిశుపాటి కులున కర్పించితి రతి

''రామకథా7మృతార్థము'' పితృపాదుల

తోc బరతత్వమందు నిడcగంటి

గీ|| దత్తభాగవతమను గ్రంథంబు నిన్న

మొన్న లింగోద్భవస్వామి కెన్నc గూర్చి

నేcడు నీకిడుచుంటి ననింద్య! దీని

నాడ నున్నాడ వీవు నావాడపనుచు- ||

అని వ్రాసికొనిరి ఇటీవల తిరుపతి వేంకటేశ్వరు నుద్దేశించి యుపశతకము మొదలవు చిన్నపొత్తముల వ్రాసిరి. అన్నియు పరమేశ్వరార్పితములే. తండ్రిగారివలెనే వీరును కైత నమ్ముకొనని దీక్ష సాగించిరి. కల్యాణకై వర్తకము కృతిపతి మాత్రము అప్పుడొక రు. 116-00 లు బహుమతిగా వలదన్నకొలcది నిచ్చిన, దానిc బదిలముగాc దాచి వారి వైశ్యదేవసమయమున బ్రాహ్మణ సత్కారము గావించిరి.

ప్రస్తుతము పూర్వాశ్రమమున మల్లాది దక్షిణామూర్తిశాస్త్రి యని ప్రసిద్ధులగు శ్రీశ్రీశ్రీ బ్రహ్మానందతీర్థ స్వామివారి ప్రేరణలో వ్రాయుచున్న 'దత్త భాగవతము' రెండవశాఖయందుc గృతిపతిని గూర్చి యిట్లు ముచ్చటించిరి.

సీ|| ఆలకాపురరాజు లాశ్రయింత్రు నీను నా

కలకాపురపు రాజు లాశ్రయంబు

చందవోలు కుబేర సదృశార్యతతి వీడి

చనలేవు నీవు నా చనవు నదియె

పెట్టిపోయంగలేని పేదలకాదు వీ

వట్టి వారల నొకండైన వాc

నాది భిక్షుcడవని యందురు నిన్ను నే

జ్ఞానభిక్షకుc జేయి సాచుచుంటి

గీ|| సామ్యమటులుంచు మెంచి నీస్వామ్యముc గృతి

నొసగు నన్గృతిc జేయు మన్యునిగc గొనకు

మిందుపురనాథ! లింగోద్భవేశ! ప్రణతు

లందుకొను మభిముఖుండవై యాలకించి||

మ|| వ్యవసాయంబునరాదు లేదు భృతికిం బాటించు నుద్యోగమ

నంవిధంబౌ పనిలేదు వృత్తియును నన్యంబేదియు న్లేదు మా

వధ! నీ సేవకునుక్తుండన్‌ గొనుము క్షుద్భాధానివృత్యర్థమా!

వ్రలో? యవీహులొ! బాలముష్టియిడెం జాలాభూతి యీ జాతికిన్‌.

దీనినిబట్టి వారి ప్రవృత్తియెల్ల విశదముగా దెలియుచున్నది. ఇప్పటికి వారికి డెబ్భదియారు వత్సరముల యీడు దినచర్య యంతయు వ్రాయవలెనన్న నెంతయో పట్టును నా కవకాశములేక తోచినంతవరకు సంగ్రహించితిని వీరింకను గొన్ని వత్సరము లిమ్మెయి సమ్మతిc జననిచ్చిన ముందటి చరిత్రాంశ మవసరమైనప్పు డింకను విశేషించి వ్రాయందలంచి యిప్పటి కింతటితో ముగించుచుంటివి.

పాఠకులు క్షమింతురుగాక.

శ్లో|| మాత్రావియుక్త శ్చతురబ్దమాత్రే

మాతామహాభ్యామవిముక్త సేవీ

గర్భాష్టమే ప్రాక్తన కర్మయోగా

దుద్బుద్ధ బుద్ధిః కవయామ్యహం త్వాం !!

ఇట్లు,

శాస్త్రిగారి దౌహిత్రుcడు,

చెఱువు సత్యనారాయణశాస్త్రి

ఈ గ్రంథ ముద్రణకు ద్రవ్యసహాయము చేసిన

శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానము వారికి

సదా కృతజ్ఞుడను.

ఇట్లు, పబ్లిషరు :

కంభంపాటి పురుషోత్తమశర్మ

పినపాడు, తెనాలి-2.

Naaku Thochina Maata    Chapters